అందమైన బాధ
అరచేతికి అందిన ఆకాశం చూసి
తారలన్నీ నావే అనుకున్నంతలోనే
అల్లంత దూరాన విసిరేసి
అలలా వచ్చినంత వేగంగా తీసుకెళ్ళిపోయావు
ఆకాశమూ సముద్రమూ నీ పోలికే
నిశిలో తారలన్నీ చూపినట్టే తెల్లారగానే యేమీ లేనట్టే
అంతలో ఆలింగనంలా అల్లుకున్నట్టే
అరక్షణంలో అన్నీ నీలో దాచుకున్నట్టే
నీవనుకునేది నాకు తెలియదు
నేనేమనుకున్నా నీకేమీ పట్టదు
బాధ అన్నది ఓపలేను
బంధం లో అది భాగమే
ఆ బంధం మాత్రం ఒక అందమే
ఎన్ని ఎదురుచూపుల వెన్నెలో అది
ఆశానిరాశల వాకిలి దాటిన మోహమది
మోహాన్ని పసితనం చేసిన పెద్దరికమది
ఎన్నో రంగులు రాగం ఆలపించి
ఇలకు రాని ఇంద్రధనుస్సు పలవరించే కల అది
ఎదుగుతూ వుంటా, ఎదురు చూస్తూ వుంటా
ఇష్టంలా, కష్టంలా, రోజానంటిపెట్టుకున్న ముల్లులా.. మల్లెలా..!
Comments
Post a Comment