||ఒక మధ్యాహ్నపు పారిజాతాలు || -- జయశ్రీ నాయుడు
నువ్వూ నేనూ....
కొన్ని మాటలూ...
కాసిన్ని నవ్వులూ
తెరవెనుక ఓ అతిథి
మౌనం తొంగిచూస్తోందీ
నాలుగు చక్రాలూ
కాలాన్ని మోసుకెళ్తున్నాయీ
ప్రక్కనుంచే వెళ్ళే పళ్ళబండీ
డోర్ పడలేదు
జాగ్రత్త సుమా అనే
హెచ్చరింపులో తోటి వాహనదారుడి స్నేహం
నగరపు రణగొణ ధ్వని
మనల్ని స్నేహిస్తూనే వుందీ
మౌనం మోహించిన మేఘమయ్యింది
జల్లులుగా నా చుట్టూ
వూసులన్నీ ఆకారం సంతరించుకున్నాయి
నువ్వూ... నీ హృదయం
ఓ ఏకాంతపు పారిజాతం
అనగనగా ఒక రోజు
ఒక అద్భుతం నీతో స్నేహించింది
మెరుపు ఆకాశానికి చెప్పి
నేలకు దిగడం నేనెప్పుడూ చూడలేదు
ఉరవళ్ళ పరవళ్ళ
సాన్నిహిత్యాలు
పేజీల్లో ఇమడని
హృదయపు చినుకులు
కాగితప్పడవలైన
కొన్ని సంవత్సరాలు
స్నేహించని ఆకాశం వుందా
కాలాన్ని అలంకరించుకోని భావముందా
ఒక్కో పారిజాతాన్నీ
తిరిగి కొమ్మకు అతికించగలవా
కదిలిపోయిన
గుండె చప్పుళ్ళు
నిశ్శబ్దించగలవా
పరిమళం నీ కన్నీటిలో...
శబ్దించని నీభాష... గుండెలో
అదిగో నీ అంతరంగపు ఫ్లవర్ వేజ్
నిస్సహాయతల్ని ఏరి అలంకరించు
కొంత జ్ఞాపకాల నీరు పొయ్యి
ఆ మూల వుంచు
నీ మదిగదిలో
అప్పుడపుడూ...
పారిజాతాలు పరిమళిస్తుంటాయి!
************************
************************
15-07-2014
ఆహా.. కాగితప్పడవ కుదుపుల్లేకుండా సాగినట్లుంది మీ కవిత. బాగా చెప్పారు.
ReplyDeleteఅవును...
పారిజాతాన్ని తిరిగి కొమ్మకు అతికించలేం....
జ్ఞాపకాల నీరు పోసి బతికించే ప్రయత్నమే చేయగలం...
హరి గారూ...
Deleteపరిమళాన్ని మాత్రమే మనసులో శాశ్వతం చేసుకోగలం!
ప్రకృతి జ్ఞాపకాలతో పాటూ కాలపు మైపూతగా మరుపుని కూడా ఇచ్చింది. మరువలేని వాటిని వెన్నెల ఏకాంతాల్లో పునర్డర్శించుకోవడమే...