మొదటి మలుపు



 అనేకానేక నీటిబిందువుల్లా కలలు
నిరంతరంగా కంటిచివర బ్యాలే చేస్తున్నవేళ కలిశావు
వడలిన పెదవంచునే...
తీయని దూరాలూ
ప్రవహించిన కాలాలూ
వడి వడిగా నడక నేర్చిన పదాలూ హత్తుకున్నాయి
తొలి ముద్దులోని మాధుర్యం లా  తేనెల దారుల్ని రచించాయి

మరువక పత్రమై గుబాళించీ
మందారం ఎరుపల్లే వెలుగులీనీ
జ్ఞాపకాల తీపిలోకి ప్రవహించాయి
ప్రతి చిరునవ్వూ ఆ తీపిగుర్తే
ప్రతి కనురెప్పా అవలీలగా
కలను పాపల్లే లాలించుకుందీ

ఋతువల్లే జీవన రీతిని మరవడం తప్పే
మారని తనం మహాపరాధమే
అడుగుల్ని ఆపే పదాలేవీ
గుండె గతిని మార్చుకున్న వైనాల వానలూ ఆర్పాలంటే
యే మమతల సూరీడి తరం...

శ్వాసకు జీవితం నేర్పాలి...
రక్తానికి కొత్త కణాల వానలు కురవాలి
ఆత్మ కథకు అనువాదాలు జ్ఞాపకాలే..
జ్ఞాపకాలకు అక్షరాల ప్రేమ నేర్పాలి
నిన్నూ నన్నూ యే కాలం నుండి యే కాలం లోకి వలస పంపాలి..

..........................................
...........................................

ఆత్మ మారిన కథకు
మళ్ళీ మొదటి మలుపు ఎదురు తెచ్చే కాలముందా...

--జయశ్రీ నాయుడు

Comments

  1. చాలా చాలా బాగుంది మేడం గారు.
    అభినందనలు.

    ReplyDelete

Post a Comment

Popular Posts