From Andhra Jyothi.... Vividha


సాహితీ విమర్శకు ఆమోదమెలా లభిస్తుంది?
విమర్శావిధానంలో విభాగాలేవో వున్నాయి. అయితే మనస్తత్వ విమర్శ, సాంఘిక విమర్శ, భౌతికవాద విమర్శ అంటూ జరిగే ఆ విమర్శావిధానాల వర్గీకరణ పాఠ్యగ్రంథాలలో కనబడుతుంది కానీ పత్రికలలో కనబడదు. పత్రికలలో విమర్శ అంటే విమర్శే. రచనలని ‘క్రైం కథ’ ‘సరసమైన కథ’ అంటూ వర్గీకరించి ప్రచురించినట్లు గా విమర్శలని వర్గీకరించి ప్రచురించడం వుండదు. కనుక విమర్శకుడు ఒక దృష్టినుపయోగించి విమర్శ చేస్తే ఆ దృష్టితోనే చదివిన పాఠకులకి తప్ప మిగిలిన వారందరికీ ఆ విమర్శ అసమగ్రంగాను, అసంబద్ధంగాను కనిపిస్తుంది. అంటే ఏ విమర్శ అయినా కొద్దిమందినే, కొన్ని వర్గాలనే ఆకర్షిస్తుంది తప్ప అందరినీ ఆకర్షించడం జరగదు. నిజమేనా? నిజమే అయితే ఈ పరిస్థితి వాంఛనీయమేనా? అవాంఛనీయమైతే దీనిని అధిగమించే మార్గం ఏమీ లేదా?
 
ఆ ప్రశ్నలు అలా వుంచితే, రచయితలలో కూడా ఈ విధమైన విభిన్న దృక్పథాలు, భావజాలాలు ఉన్నాయి. అయినప్పటికీ అన్ని వర్గాల పాఠకులనీ మెప్పించే రచయితలు కొందరు వుంటారు. మెప్పించడం అనేది సరైన మాట కాదేమో! మరోలా చెప్పాలంటే ఏ వర్గానికి చెందిన పాఠకులైనా నిర్లక్ష్యం చేయలేని రచయితలు కొందరు వుంటారు. కొందరు రచయితల అభిప్రాయంతో, భావజాలంతో, దృక్పథంతో తాము ఏకీభవించనప్పటికీ పుస్తకప్రేమికులైన పాఠకులందరూ ఆ రచయితల రచనలను చదువుతారు. కొంత అభిమానాన్నీ, గౌరవాన్నీ చూపుతారు. ఎందుకు? ‘శైలి కోసం, రచనలోని సౌందర్యం కోసం’ అనేది ఒక జవాబు. అయితే అది పాక్షిక సత్యం మాత్రమే. నిజానికి ఆయా రచయితలు ఆ గౌరవాన్ని తమ రచనా ప్రతిభతో కన్నా తమ నిబద్ధతతో సాధించుకుంటారు. తాము నమ్మే దృక్పథంపై, భావజాలంపై తమకి వున్న సాధికారత తో సాధించుకుంటారు. తమకి తమ దృక్పథంపై వున్నది ‘అచంచల విశ్వాసమే’ కానీ ‘మోహం’ కాదని నిరూపించుకోవడం ద్వారా సాధించుకుంటారు.
 
ఒక రచయిత ఈ రకమైన గౌరవాన్ని సాధించడానికి నిజాయితీ, నిర్మోహం, పరిశీలనాశక్తి, సహజత్వం అనే నాలుగు అంశాలు అవసరం. మొదటి మూడూ రచయితకి ఉండాల్సిన లక్షణాలు అయితే నాలుగోది రచనలో ఉండాల్సిన లక్షణం. ఇంకొక రకంగా విభజిస్తే, మొదటి రెండూ (నిజాయితీ, నిర్మోహం) రచనలో పరోక్షంగా గోచరమయ్యే రచయిత వ్యక్తిత్వానికి సూచనలు అయితే చివరి రెండూ (పరిశీలనాశక్తి, సహజత్వం) రచనలో ప్రత్యక్షంగా కనబడే రచయిత ప్రతిభకి సూచనలు.
 
ఇటువంటి లక్షణాలు, ఈ రకమైన మరికొన్ని లక్షణాలూ రచయితలకి గౌరవాన్నీ, తిరస్కారంలో కూడా ఒకింత ఆమోదాన్నీ తెచ్చిపెడతాయనుకుంటే, మరి ఆ రకమైన గౌరవాన్ని సాధించడానికి విమర్శకులకి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? 
నా ఉద్దేశ్యంలో అవి మళ్ళీ నిజాయితీ, నిర్మోహం, సునిశితత్వం, స్పష్టత. మంచి విమర్శకుడిలోను, మంచి రచయితలోను పాఠకులు వెతుక్కునే లక్షణాలు ఇంకా కొన్ని ఉండవచ్చు. అయితే ఇక్కడ నేను పైన చెప్పినట్లుగా గౌరవాన్నీ, తిరస్కారంలో కూడా ఒకింత ఆమోదాన్నీ తెచ్చిపెట్టడానికి అవసరమైన కనీస లక్షణాలుగా నేను భావిస్తున్న వాటిని మాత్రమే ప్రస్తావిస్తున్నాను.
ఇక్కడ మళ్ళీ నిజాయితీ, నిర్మోహం అనేవి వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణాలయితే సునిశితత్వం,స్పష్టత అన్నవి విమర్శనా ప్రతిభకి సంబంధించినవి. నిజాయితీకి నిర్మోహానికి తేడా వుంది. అన్ని విమర్శలకీ రెండు లక్షణాలూ అవసరమే అయినప్పటికీ తమ భావజాలానికి సరిపడని రచనని విమర్శిస్తున్నపుదు నిజాయితీ కొంచెం ఎక్కువగా అవసరమైతే, తమకి యిష్టమైన భావజాలానికి సంబంధించిన రచనని విమర్శిస్తున్నపుడు నిర్మోహం కొంచెం ఎక్కువగా అవసరమవుతుంది.
 
రచయితలకయితే, తమ వ్యక్తిత్వంలో వున్న ఈ రెండు లక్షణాలని రచనలో చూపడానికి వారి పరిశీలనాశక్తి, రచనలోసహజత్వం అనే అంశాలు తోడ్పడతాయి. రచయిత వ్యక్తిత్వంలో వున్న నిజాయితీ,నిర్మోహం అనేలక్షణాలని పాఠకుడు గుర్తుపట్టడానికి, తద్వారా ఆ రచయిత పట్ల గౌరవం పెంచుకోవడానికీ రచనలో అసహజత్వ మూ వైరుధ్యాలూ లేకపోవడం అనే అంశం సహాయం చేస్తుంది. ఇవే సూత్రాలు విమర్శకు కూడా వర్తిస్తాయి. ఒక విమర్శలో దాటవేతధోరణీ, కుతర్కమూ కాక సునిశితత్వమూ, స్పష్టతా కనబడినపుడు విమర్శకుని వ్యక్తిత్వంలోని నిజాయితీ, నిర్మోహం అనే లక్షణాలను పాఠకులు గుర్తించగలుగుతారు, గౌరవించగలుగుతారు. వ్యక్తిత్వంలో నిజాయితీని పెంపొందించుకోవడం కొంత సులభం. తనకి నచ్చని భావజాలపు రచనకు అనవసర దోషాలు అంటగట్టక పోవడం, అందులో వున్న మంచిని దాచిపెట్టే ప్రయత్నం చేయకపోవడం, అలాగే తనకి యిష్టమైన దృక్పథానికి చెందిన రచనలలోని గుణాలనీ దోషాలనీ పెంచకుండా తగ్గించకుండా చెప్పగలగడం ఇవన్నీ నిజాయితీకి సూచనలు. ఇక్కడ ‘ఇష్టం’ అనేచోట ‘ప్రయోజనం’ అనేమాటని కూడా పరిగణించాలి. అంటే తనకి వ్యక్తిగతం గా ‘ప్రయోజనం’ కలిగించే రచనపట్లా రచయితపట్లా ‘ప్రత్యేకమైన’ యిష్టం ఉండకపోవడం కూడా నిజాయితీనే.
 
 ఇకపోతే నిర్మోహం. ఇది తాను మెచ్చిన భావజాలంలో వున్న దోషాలను కూడా చూసే శక్తిని యిస్తుంది. దీనిని సాధించడం అంత సులభం కాదు. ఎందుకంటే నిజాయితీ ‘బుద్ధి’కి సంబంధించిన విషయమయితే నిర్మోహం ‘మనసు’కు సంబంధించిన విషయం. బుద్ధిని నియంత్రణలో పెట్టుకోవడం కంటే మనసును నియంత్రణలో పెట్టుకోవడం కష్టం.
 
తెలుగులో ప్రస్తుతం విమర్శలు, విశ్లేషణలు, సమీక్షలు చేస్తున్నవారు రెండురకాలుగా కనిపిస్తున్నారు. ఒక వర్గం వారు విమర్శ వ్రాసేందుకు ప్రత్యేకించి ఏ నియమాలు, నియంత్రణలు, దృక్పథాలు పాటించరు. వారి హృదయమే వారికి ప్రమాణం. ఆ హృదయం ఆ సమయానికి ఆ రచనలోనుంచి ఏది గ్రహిస్తే అది వారి విమర్శలో కనబడుతుంది. ‘హృదయాన్ని కదిలించింది’, ‘చదవడం పూర్తయ్యాక కూడా నన్ను వెంటాడింది’, ‘ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది’, వంటి విశేషణాలతో ఇటువంటి విమర్శలు మనకి కనిపిస్తూ వుంటాయి. ఈ విమర్శలలో ఏ అభిప్రాయానికీ వివరణలు వుండవు. ఎందుకు హృదయాన్ని కదిలించింది? ఏ కారణం వలన వెంటాడింది? అనే ప్రశ్నలూ, వాటికి సమాధానాలూ వుండవు. ముందేచెప్పుకున్నట్లు ఈ విమర్శకులకు వారి ‘హృదయం’ మాత్రమే ప్రమాణం కనుక వారివ్యాఖ్యలకు కారణాలు, మూలాలు వారి హృదయంలో మాత్రమే లభ్యమవుతాయి. వాటిని రచనలో చూపడం కష్టమే కాదు ఒక్కొక్కసారి అసాధ్యం కూడా. ఎందుకంటే ఆ వ్యాఖ్యలకి ఆధారాలు అసలు అ రచనలో ఉండకనే పోవచ్చు. అక్కడ లేని విషయాన్ని కూడా హృదయం చూసి ఉండవచ్చు. దానికి ఆ శక్తి వున్నది కదా!
 
ఇక రెండవరకం విమర్శకులు ఏదో ఒక దృక్పథంపై ఆధారపడి విమర్శ చేసేవారు అయివుంటారు. వీరు విమర్శ అనేది కొన్ని నియమాలకు, నిర్వచనాలకు లోబడి వుండాలని భావిస్తారు. విమర్శలో తమ వ్యాఖ్యలకు ఉదాహరణలు, ప్రమాణాలు, ఆధారాలు చూపుతూ వుంటారు. రచనలలోని వైరుధ్యాలనీ, రచయితల అవగాహనలలోని లోపాలని తమ విమర్శలలో ప్రస్తావిస్తూ వుంటారు. పాఠకులు మంచి విమర్శకుని లక్షణాలుగా భావించే సునిశితత్వము, స్పష్టతలను సాధించేందుకు ప్రయత్నిస్తూ వుంటారు.
 
సాధారణంగా మొదటిరకం విమర్శకుల కంటే రెండవరకం విమర్శకులు ఎక్కువ ప్రాధాన్యతనీ పేరునీ సంపాదించుకోవడమూ, మేధావులుగా పరిగణించబడడమూ చూస్తుంటాము. అది సహజమే. ఎందుకంటే తమ హృదయమే, తమ అభిరుచులే ప్రమాణంగా విమర్శ చేసినపుడు అందులో ‘సునిశితత్వము, స్పష్టత’ వుండవు. కనుక ఆ విమర్శలు శ్రద్ధాళులైన పాఠకులను అంతగా ఆకర్షించవు. అటువంటి విమర్శలను పెద్దగా లక్ష్యపెట్టడమూ జరగదు. వాటి పట్ల గౌరవమూ కలగదు.
 
అయితే ప్రాధాన్యతను, గుర్తింపును తెచ్చుకుంటున్న రెండవరకం విమర్శకులు పాఠకుల ఆమోదాన్నీ, గౌరవాన్నీ కూడా సంపాదించుకుంటున్నారా అని పరిశీలిస్తే లేదన్న సమాధానమే లభిస్తోంది. నిజం. శ్రద్ధగా చదివే పాఠకుల మనసులో గౌరవాన్ని సంపాదించుకుంటున్న విమర్శకులు ప్రస్తుతం ఒక్క చేతి వేళ్ళ మీద లెక్క పెట్టేందుకు కూడా దొరకడం లేదు.
 
అందుకు కారణాలేమిటని పరిశీలిస్తే, సునిశితంగా, స్పష్టంగా విశ్లేషించగల శక్తి వున్న ఈ విమర్శకులు ‘నిజాయితీ’ని కొంతవరకు అలవరచుకుంటున్నారు కానీ ‘నిర్మోహా’న్ని పెంపొందించుకోలేకపోతున్నారు. అవును సునిశితంగా స్పష్టంగా విశ్లేషించగల తమ ప్రతిభని తమకి నచ్చని భావజాలం, దృక్పథం వున్న రచనలని విమర్శించేటపుడు వారు చాలా చక్కగా చూపుతున్నారు. అది ‘నిజాయితీ’గానే చేస్తున్నారు. అయితే తమకి యిష్టమైన రచయితల రచనలను విమర్శించే సందర్భాలలో వీరు తమకి ఏ సునిశితత్వము, స్పష్టత అయితే గుర్తింపు తెచ్చాయో వాటిని ప్రక్కకి పెట్టి ‘హృదయం’ మీద ఆధారపడుతున్నారు. ఈ విషయాన్ని ఎవరైనా ఎత్తి చూపినప్పటికీ గుర్తించలేకపోతున్నారు. ఆధారాలు లేకుండా చెప్పే ఏ అభిప్రాయానికీ విశ్వసనీయత ఉండదని తెలిసి తెలిసీ మోహంలో పడుతున్నారు.
ఈ వ్యాసం ద్వారా నేను ఒకరినీ ఇద్దరినీ ఉదాహరించకుండా ప్రస్తుతం తెలుగు సాహితీవిమర్శ చేస్తున్న వారందరికీ నావంటి పాఠకుల తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. కనీసం నిజాయితీ, ప్రతిభ వున్న విమర్శకులయినా నిర్మోహాన్ని పెంపొందించుకుని పాఠకుల విశ్వసనీయతనీ, అభిమానాన్నీ సగర్వంగా సాధించుకోవాలని కోరుకుంటున్నాను.
 

Comments

Popular Posts