ప్రశ్నల్లేవు....కేవలం ప్రశ్నార్థక చిహ్నలే...
https://www.facebook.com/groups/kavisangamam/840190182700402/?notif_t=like
దేవకన్యలా నాట్యమాడిన కాలాలు
నిశ్శబ్దపు మబ్బు తునకల్లా
ఎన్ని మంచు తెరల్లో దాగిపోయాయో...
నీలమైన గొడుగు నీడలా కమ్మిందా...?
నీరై నిదురమబ్బుల్లా
రెప్పల పొరలు తవ్వుకుంటూ పోయిందా...?
కలం ఒలికించే కలలూ
అక్షరాల్లో తర్జుమా అవని అనుభవాలూ
కాలాలు నిలవని భోగాలూ
అడగని ప్రశ్నల జవాబుల చిహ్నాలూ మిగిలాయా...?
సమాధానమవలేని ప్రశ్నల శృతులెన్నీ చెప్పగలవా...?
వగరునీ
వగరు వెనుక తీపినీ ఒకేసారి దర్శించలేని ద్రష్టవా... ?
మౌనం కూడా ఒక కారాగృహం అని తెలిసిన వేళల్లో...
ఆలోచనగా కూడ రూపుదిద్దుకోని మన:తరంగాలు
రేయి పొరల్లో నిక్షిప్తమవుతున్నాయి.
జడత్వపు మేలిముసుగు చేదించీ
అంత: చైతన్యాన్ని ధరించీ
ఉదయాన్ని శ్వాశించే ప్రతి క్షణాన్నీ అడుగుతున్నాను...
ప్రశ్నల్లేవు....కేవలం ప్రశ్నార్థక చిహ్నలే...
బహుశా జీవితపు పునాదులూ అవేనేమో...
Comments
Post a Comment