తృష్ణబిలాలు



వెన్నెల తళతళ నీ అక్షరాల్లో
వుప్పొంగించే హృదయం ఆ పదాల్లో

తళుకు తారలు నా ఎదుటే జలజలా రాలేవి
ఆ క్షణాల పరదాలో హృదయం పడుగు పేకల్లే అల్లుకుపోయేది

చందమామ మెరిసిన ఆకాశం మసకేసిందా
వెన్నెల దారులు కనుమరుగయ్యాయా

మాటల మానస సరోవరం 
యేదేవుడో దాచేసుకున్న వరమయ్యిందా

యీ ఎడతెగని దూరాల్లో 
ఒక్కో అడుగూ లెక్కిస్తున్నా

దుమారంలా కమ్మేసింది ఒక ఏకాంతం
ఊహల్లా ఉరికొచ్చే రెక్కలన్నీ చెదురుతున్నాయి





ఆ వెంటే నీలవర్ణపు నిశ్శబ్దం
రూపు రేఖలు ఏకం చేస్తున్న ఓ కృష్ణబిలం

గుప్పెడు గుండె ముందు యే విశ్వరూపమైనా బలాదూరే 
ఇక్కడున్నాయి చూడు శతకోటి తృష్ణ బిలాలు! 

ప్రతి క్షణమూ కరిగిపోతోంది
మాటలు తోచని తోవలో చిక్కిన చీకటిగా 

తారలన్నీ కాంతి వేగాన్ని దాటేసి
నిరాశల నవ్వుల సుడిగుండంలో తునకలయ్యాయి

ఎన్ని కాంక్షలో... మరెన్ని కృష్ణ బిలాలో
ఎన్నెన్ని హృదయ విశ్వాలో...

నిరామయంగా మోసుకెళ్దాం 
ఇచ్చి పుచ్చుకుంటూ మన మనసు గెలాక్సీలు!

Comments

Popular Posts