దోసిలిలో... దొరకని ముత్యాలు

మాటలన్నీ అరువు మాటలు..లేదా గాయపడ్డ మాటలు. అవి గాయపడి మన ముందు పడే పక్షులు..వాటిని చేతుల్లోకి తీసుకొని వాటి నెత్తుటి రెక్కల్ని తుడిచి, వోదార్చే సిద్ధార్థత్వం కవిత్వం! -- Afsar Mohammed



"కవిత్వం అనేది నా దృష్టిలో మిమ్మల్ని గురించి ప్రతి క్షణం కొత్తగా పరిచయం చేసే క్రియ. 
రాసినప్పుడల్లా మీకు మీరు కొత్తగా కనిపిస్తారు, అనిపిస్తారు! 
అలా జరక్కపోతే అది కవిత్వంగా బతకదు." -- Afsar Mohammed


Kavi Yakoob


*తొడగని ఉంగరం*


ముడతలు పడిన స్వప్నం ముందు
ఒళ్ళు విరుచుకుంటుంది నిద్ర

ఆ లోపలి
సొరంగంలోంచి అజ్ఞాత మానవుడెవడో నడుచుకుంటూ
తీరిగ్గా నిద్రా ప్రేమగీతాలు రచిస్తుంటాడు.

అతడి చుట్టూ
అంగరక్షకుల్లాంటి ఊళ్లు
ఒదగని ప్రేమలు

ప్రేమ చేష్టలు తెలియని కోయపిల్ల

తోట గెట్టుమీది బంతి పూలన్నిటిని
తలలో దోపుకుంటుంది
ఎట్లా కనబరచాలో తెలియని ప్రేమకు మల్లే !

కలవరమైన మదితో
జగజీత్ సింగ్ గజల్ చుట్టూ గిరికీలు కొడుతున్న
తుమ్మెదలా అతడు


కోయపిల్ల స్వప్నాంతర వాసి

తొడగని ఉంగరం
చేపకూడా మింగని మరుపులో దాగిన ఉంగరం-అతని ప్రేమ కథ!

విఫలప్రేమలన్నీ తాత్వికతల చుట్టూ తిరుగుతుంటాయి కాబోలు
చేల మధ్య ఎత్తాటిమంచె విరహవేదిక-
కోర్కెలు తీరని ఆత్మలన్నీ
ఆ మంచెమీదే సమావేశమవుతాయి.

మోహానికి వయోపరిమితి లేదు

ప్రేమలు కొత్త సందర్భాలు
నిద్రల్లోనే ప్రేమల పునర్మూల్యాంకనం
రహస్య ప్రేమల్లోనే దాగిన నిజమైన ప్రేమలు

ప్రేమలకు ముందూ వెనకా
వాడిన ఊళ్లలాంటి కలలు.

౦౦@౦౦


Comments

  1. చాలా బాగుంది జయశ్రీ గారూ!
    తొడగని ఉంగరం
    చేపకూడా మింగని మరుపులో దాగిన ఉంగరం-అతని ప్రేమ కథ!
    శాకుంతలాన్ని కూడా...గుర్తు చేసేసారు...
    @శ్రీ

    ReplyDelete

Post a Comment

Popular Posts