ప్రశ్నా కిరీటాలు!

ప్రశ్నా కిరీటాలు!
--  జయశ్రీ నాయుడు

కొన్ని పొరలు దాచుకున్న సత్యాలు
కాలం చిర్నవ్వు తళుకులోనే ఆవిష్కృతమయేది

మొదటి అడుగులోనే లెక్కల లౌక్యమెందుకు

ఎంత దూరముందో తెలియని ప్రయాణం

శ్వాసల అడుగులు వాయులీనాలు
ఆత్మాంతరంగాల వాదోపవాదాలు
కనిపించే కొన్ని లోకాలు
నిర్ధారింపుల్లా దివారాత్రాలు

నిజాయితీ తో అబద్ధాన్నైనా జీవిస్తా
హక్కు నాది

నీ నిజంలో నిజమెంతో నిర్ధారించనీ
అపనమ్మకం కూడా నా హక్కే...

అనుభవాలకు నిరూపణలడిగే కాలంలో
వానచినుకు యేమేఘానిదో ఎలా ఎరుకపర్చాలి..

గుండెతడి యే మేఘానిదో ఆ గుండెకే ఎరుక
మానవత్వపు స్టెతస్కోప్ లేకుండా యే నాడి లెక్కిస్తావ్..

ఎండలో వేడిగా వెలుగులీనుతూ
మేఘంలో ఆర్ద్రతగా నిండి దయ వర్షిస్తూ
పత్రంలో హరితంగా మమేకమౌతూ
పుష్పంలో రంగుల్లా ఇంద్రధనుసు
మినియేచర్ ప్రకృతి

మనిషీ....

వికృతులూ ప్రకృతిలో భాగమే
ఎన్నిక నీదీ నాదీ

యే అడుగుకైనా
 మడుగులుగా కూడుకునే గతాలౌతుంది కాలం


చివరి మలుపులో
 ఏ ప్రతిబింబం నిర్ధారించుతావు

 వెనక్కి తిరిగినపుడు
సమాధానపు సంతృప్తి చిరునవ్వు లా???
సందేహాత్మాశ్రయ జగత్తు లా???

 మూసిన  పిడికిట్లోని ప్రశ్నలే
 స్తంభించిన శ్వాసగా  శరీరపు పరిధిగా
 స్వేచ్చా మయ జగత్తు రచించుకున్న ఆ సంకల్పానిదీ!

Comments

Popular Posts