Gulzar Kathalu
గుల్జార్ కథలు చదివాక...
తన సినిమాల్లాగే ఈ కథలూ అనిపించింది.
అనవసరమైన దృశ్య వర్ణన గానీ, ఎమోషనల్ పొడిగింపులు లేకుండా.. యెలా క్లుప్తంగా కథ రాయొచ్చో ప్రాక్టికల్ గా చూపించాడు. మృణాళిని గారి అనువాదం కూడా గుల్జార్ని యధాతధంగా మనకందిస్తుంది.
మొదటి కథ "బిమల్దా" నుంచి ఏడో కథ "నాన్నమ్మా, పదిపైసలు" ఏకబిగిన చదివిస్తాయి. ఇక కొంత ఉత్తరాది ఆచార వ్యవహారాల శైలి ప్రభావం చిక్కబడే కొద్దీ, కథలు చదవడం లో వేగం తగ్గింది. సీమా కథ - సారిక, సంజీవి కపూర్ నటించిన "కత్ల్" చిత్రానికి మూల కథ అనిపిస్తుంది. "డాలియా" కథ - డింపుల్ కపాడియా నటించిన "రుడాలి" స్పష్తం గా కనిపించింది, గుడ్డో కథ -- గుడ్డి (Guddi film - starring Jayabhaduri and Navin Nischal) చిత్రానికి మూల కథలనుకోవచ్చు.
"కానీ..." కథలో సూపర్ నాచురల్ ఎలిమెంట్ గుల్జార్ తన వంతు ప్రయత్నం గా రాశాడేమో అనిపిస్తుంది.
"పొగ" కథలో మరణించిన ఊరిపెద్ద చౌధరి మరణ వాంగ్మూలం మీద ఒక వూరు మొత్తం అతలా కుతలమయ్యి, బ్రైతికి వున్న అతని భార్యని దహనం చేసి, చనిపోయిన చౌదరినేమో అతని కోరికకు విరుద్ధం గా ఖననం చేయడంలో -- కనిపించని వ్యంగ్యం కత్తిలా దిగుతుంది.
"ఓ అయ్య చేతిలో పెట్టడం మంచిది" కథలో.. స్త్రీ మనో భావ చిత్రణ, జీవితం కథలో -- సమీర్ వ్యక్తిత్వ సారం మన మనసుకు ఒక పెద్ద కుదుపు ఇస్తుంది, తెలిసినవే అనుకున్నది కొత్త రూపం తో మన ముందు ప్రత్యక్షం అవుతుంది.
"నిప్పును మచ్చిక చేసుకున్న హబు" కథలో ఆదిమ మానవుడి ఆలోచనా ధోరణి సున్నితంగా స్పష్టంగా తనదైన పదాల పదునుతో మన కళ్ళముందుంచుతాడు గుల్జార్. ఆ కథ చదివేటపుడు, దట్టమైన అడవుల్లొ ఆదిమ మానవులు తమ సంతతి తోటి, ప్రతి క్షణం అయోమయం లో పడేసే ప్రకృతి సహజ గుణాలతో - వర్షాలు కురవడమంటే - పైనుండి దేవతలు అందరూ ఒకే సారి ఉచ్చ పోశారనడం, హబు తనకు తెలియకుండానే పెద్ద ఏనుగుని మచ్చిక చేసుకోనే విధానం, ఇక తర్వాత వర్ణించే వింత జంతువు -- అదే మంటలు -- ఆదిమ మానవుడి అయోమయం.. కథ చివర్లో.. ఒక్క కుదుపు ఇస్తాడూ.. మంట ఆరిన తర్వాత వచ్చే పొగ పైకి పోవడాన్ని చూసి, చచ్చిపోయిన వాళ్ళంతా పైకి పోతారనే కాన్సెప్ట్ తో ముగించడం. ఆధునికుల చెంప మీద ఆదిమ మానవుడి చెంపపెట్టులా అనిపిస్తుంది.
ముందుమాటలో గుల్జార్ చెప్పినట్టు.. "రావి నదికి ఆవల కథ" నుంచీ, చివరి కథ "నేరేడు చెట్టు" వరకూ.. విభజన సమయం లోని అతలాకుతలపు కుదుపులు కథల్లో మనకి అందుతూనే వుంటాయి. ప్రతి ఒక్క కథ గుల్జార్ ముద్రను మోస్తుంది, గుల్జార్ మనముందు నిలబడి వర్ణిస్తున్నట్టుంటాయి - గుల్జార్ వెసుకునే లాల్చీ అంత క్రిస్ప్ గా, సూటిగా, దాని తెలుగు (తెలుపు) రంగంత స్పష్టంగా.
if reading is a joy.. gulzar fills your cup of reading... go ahead..
-- Jayashree Naidu
Comments
Post a Comment