Literary Lessons - Afsar Afsar


** మొదట్లో కొంతకాలం ఆవేశంగా రాస్తాం కవిత్వం. అప్పుడు ఉద్వేగం ఉప్పెనై ముంచెత్తుతుంది. రాయకపోతే వొక రకమయిన వొంటరితనం బాధిస్తుంది. నిజమే! కానీ, ఆ ఆవేశం యెప్పుడో వొకప్పుడు ఆరిపోతుంది. ఆరిపోయిన తరవాత మనలోపలి నిప్పు కణమేదో రాలిపోయినట్టే వుంటుంది. వొక రాయలేనితనం లోపల గుబులు పుట్టిస్తుంది. 

**  the sound in your mind/is the first sound/that you could sing. -- Kerouac

** మామూలుగా ప్రతి కవీ తను రాసిన వాక్యాల్ని వొకటికి  పది సార్లు చెక్కుకుంటాడు. భావం పలికే దాకా వాక్యాల్ని తిరగరాస్తాడు. అలాంటి దశలో అతను కాసేపు కవి అనే స్థానం నించి పక్కకి తొలగి, పాఠకుడై, తనని తాని చదువుకుంటాడు. తన వాక్యాలలో తన ప్రతిబింబాన్ని తరచి చూసుకుంటాడు. తన భావనల  ప్రభావాన్ని పరీక్షించి చూసుకుంటాడు. ఇంకా ముందుకు వెళ్ళి తానే ఎడిటర్ అయి, వాటికి post-mortem చేసుకుంటాడు. మంచి కవిత తయారవడానికి ఇవన్నీ అవసరమే!  కానీ, కొన్ని వేళల్లో జీవితం అనుకూలించదు. కవిత్వ రూపం విసుగు పుట్టిస్తుంది. అలాంటి స్థితిలో ఏం చేస్తాడు కవి? తన పదాల్ని కూడదీసుకుంటాడు. తన భావాన్ని పరిమితమయిన/ తేలికపాటి రేఖల్లో వెతుక్కుంటాడు.

అలాంటి  స్థితిని Sketching అని పిలిచాడు Kerouac. అలా వొక మెరుపు లాంటి ఆలోచన తరవాత్తరవాత -Joyce Johnson అనే సాహిత్య చరిత్రకారిణి చెప్పినట్టు-  “a whole new movement of American literature (spontaneous prose and poetry)” అవుతుందని అతను వూహించనే లేదు. కానీ, వూహించనివి జరగడం వల్లనే కదా చరిత్రకయినా, జీవితానికయినా అంత అందం! 



** Sketching and Spontaneity -- కవిత్వంలో సాధించడానికి జీవితాన్ని దగ్గిరగా  చదవగలిగే సహనం వుండాలి. వొక తాజా కంటితో వాస్తవికతని చూసే ధైర్యమూ వుండాలి. అన్నిటికంటే ముందు, క్లిష్టమయిన భాష పట్ల వుండే విపరీతమయిన ఆకర్షణ తొలగిపోవాలి. లేకపోతే, రెండో వాక్యం పుట్టే లోగా మొదటి  వాక్యం జారుకుంటుంది. వొక భావం చెప్పేలోగా  ఇంకో భావం దారి తప్పుతుంది.

ప్రతి కవీ మనకి వొక శిల్ప రహస్యం చెప్తాడు,ఆ వాక్యాల వెంట నడిచే తీరిక మనకి వుంటే!

ఇతరుల అనుభవాల నించి నేర్చుకునే నిర్మలమయిన మనసు కవికి చాలా అవసరం. వాళ్ళ బలాల్నీ, బలహీనతల్నీ సమానంగా ప్రేమించే సమహృదయమూ అవసరం. ఎందుకంటే, మన అనుభవాల్లో ఎన్ని నిజంగా కవితలుగా మార్చగలమో గ్యారంటీగా చెప్పలేం. కొన్ని అనుభవాలు అవ్యక్తంగానే మిగిలిపోవచ్చు. కొన్ని వ్యక్తమయినా సంతృప్తి మిగలకపోవచ్చు. అన్నిటికీ మించి, మనసులోని ప్రతీదీ వాక్యం చేయడానికి జీవితం వొప్పుకోకపోవచ్చు. జీవితంలోకి వెళ్ళే కొద్దీ మనం ముడుచుకుపోతాం. అనుభవాలు కొన్ని తలుపుల్ని మూసేస్తాయి. బంధాలు కొన్ని భావాల్ని బంధించేస్తాయి. వాస్తవం విపరీతంగా బాధిస్తుంది.  అప్పుడు కవి చేయగలిగింది వొక స్కెచ్ గీసుకోవడం! మొత్తం అనుభవంలోని సాంద్రతని వ్యక్తం చేయలేని నిస్సహాయత్వంలో రేఖామాత్రంగా ఆ అనుభవం చెప్పడం! అదే స్కెచింగ్ అని నేను అంటున్నాను. 

--- Afsar 

** source link : http://vaakili.com/patrika/?p=59

Comments

  1. అభినందనలు......చదివే అవకాశం దొరికి షేర్ చేసుకునేందుకు!

    ReplyDelete

Post a Comment

Popular Posts