అలిఖితాలు 2


వొలికిన వెన్నెల్ల వేళలు
ఆకాశమంతా పరుచుకున్నాయి

దోసిళ్ళతో చుక్కల్ని దాచేసుకున్న ఆశ
పర్చుకున్న కుచ్చెళ్ళ జరీ పోగుల్లో మినుకుమంటోంది

పైటంచుకీ నడుము వొంపుకీ
అర్థవృత్తాకార ఆలంబనలా
హృదయమంతా రేపటినే చుట్టుకుంది

అక్షరాల చెంకీలు లెక్కెట్టుకుంటూ
జడగంటల్లో ఘడియల కోలాటం
కదలని కాలానికి అడుగులు నేర్పుతోంది

ఎదురుచూపుల వనవిహారం
ఎండుటాకుల గల గలలో దాక్కుంటున్న ఒంటరితనం
 నారుమడుల్లో మొలకెత్తే  పచ్చదనం
ఆశల చివుళ్ళ అద్దకం సింగారిస్తోంది

నరకడం సుళూవేనోయ్ తోటమాలీ
అంటు కట్టేవేళ సౌకుమార్యపు తొలిపాఠాలు
బండబారిన వేళ్ళ చివర్లకు
లేచివుళ్ళ జీవ రహస్యాల  పఠనం నేర్పుతాయి

రహస్యాల వెల్లువలో
తోటమాలీ ప్రకృతీ
అనుదినం
పరస్పర స్నేహ ప్రధమాక్షరం నెరుస్తూనే వుంటారు

ఆగలేని సజీవ సౌందర్యం పొంగులవుతోంది
హరితం నీలం సువర్ణం పోగుల నూగుల్లో
గుండె తనకలనేత చూసుకుంటోంది

 అనంతంగా అందగిస్తూనే వుంది సృష్టి కావ్యం
ఆరేసిన పగటికీ మడతలై చుట్టుకునే రేయికీ
ముద్దకుట్టులాంటి ముద్దులు సింగారిస్తోంది.
నాలోని దీర్ఘాలోచనల సాయంకాలం

--  జయశ్రీ నాయుడు

Comments

Popular Posts