IN MEMORY OF YOU




 నవ్వుల మెరుపుల్నీ
పదాల ఉరుముల్నీ
కాశ వాణిగా 
తరంగ దైర్ఘ్యం తో విసిరేసినవాడా

నీ జీవితపు బౌండుబుక్కులో
పేజీలు ఖాళీగా వదిలేసి  
కాలం వేలు పట్టుకుని
మెట్లెక్కి మాయమైపోయావు....








KUMAR VARMA KK

https://www.facebook.com/photo.php?fbid=10202685218472202&set=a.1704749619166.2084320.1250779577&type=1&theater

ఇది దుఖ ఋతువు
ఒక్కొక్కరూ అలా నవ్వులు రువ్వుతూ
భుజం తడుతూ భరోసా ఇస్తూ
నువ్వు నేను తేరిపార చూసే లోపే
మాయమై పోవడం ఎంత విషాదం
హిందూ మహా సముద్రాన్ని పుక్కిట పట్టి
తుప్పున ఉమ్మిన వాడే కదా తెరేషన్న
ఇది దుఖ ఋతువు
ఉగ్గబట్టుకోలేక పిదికిలిలోంచి ధారగా
ఇంత తడి మట్టిని నెత్తిన బోసుకుని
దుఖాన్ని కడుక్కొనగలమా...
నీ నవ్వులన్నీ ఆ నల్ల చందమామలో
దాగి వెలుతురు పిట్టల రెక్కలపై
నిగారిస్తున్నాయి..
నువ్వెత్తిన నల్ల జెండా భుజం మార్చుకుంది...


(దళితోద్యమ కవి సూరీడు అన్న Theresh Babu Pydi హఠాణ్మరణం తీరని లోటుగా తనకో నూలిపోగుగా)

KRANTHI SRINIVASARAO

అక్షర సూర్యుడు ఆలోచించడం మానేసాడు 
తేరేష్ అన్న మనకిక లేరు
అక్షరమై పిడికిలెత్తి
వేయు సముద్ర ఘోషలను పలికించిన కంఠం నేడెక్కడమ్మా 

హిందూమహా సముద్రాన్ని ఎత్తిపోసిన ఆచేతులెక్కడమ్మా 


RAJ MADIRAJU

https://www.facebook.com/raj.madiraju?fref=ts

తేరేష్ బాబు.. మొదట ఆయన చిరునవ్వు పలకరించేది.. ఆతరవాత ఆయన కవిత కట్టిపడేసేది..
నాకాయన పరిచయమై యేడాది అయి ఉంటుంది.. ఇదే ఫేస్‌బుక్కులో.. ఎక్కడో ఒక స్నేహితుడి వాల్‌పై ఆయన రాసిన కవితలు చదివాను. కవితల్లో, కవితల్లోని మాటల్లో, మాటల్లోని అక్షరాల్లో, అక్షరాల మధ్య అణువుల్లో కూడా శక్తి నింపి విస్ఫోటనానికి సిధ్ధంగా ఉన్న అణుబాంబుల్లా కనిపించాయి ఆయన కవితలు.. అప్పట్నుంచీ ఆయన ప్రతి పోస్టూ చదవడం, మిగతావారు రాసిన కవితలు కూడా ఆయనతో పోల్చి చూడడం అలవాటైపోయింది..
* * *
బైట
నేతితో వెలిగించిన కార్తీక దీపాలు ధగ ధగా
లోపల
అసంతృప్తితో రగులుతున్న కవిహృదయం భగ భగా
* * *
రెక్కల కష్టం పేరు నాన్న
రెప్పలకష్టం పేరూ నాన్నే
ఉలీ బాడిశలు చెక్కిన
అన్నం మెతుకు పేరు నాన్న
* * *
రావడానికీ పోవడానికీ మధ్య
పెద్ద తేడా ఏమీ కనబడదు
రాకపోకలమధ్య మిగిలిపోయే
పాదముద్రల గురించే గొడవంతా !
నేల మీద కొన్ని
గుండెలమీద కొన్ని
* * *
కోరికను బ్లేడుతో చివ్వి చివ్వీ
ఒకళ్ళ శరీరంలోకి మరొకళ్ళు
దూకుడుగా దిగాబడ్డం
పాము ముంగిసల్లా మేలేసుకు పోర్లాడ్డం
బాధాకరమే !
బుగ్గ మీద సిగ్గు ఒకల్లకేమో నెత్తుటి చెమ్మ
ఎవరు పొరబడుతున్నారు ?
* * *
అణువున అనంతమున్నది..
అహమున స్వరజలధి ఉన్నది..
పైడి కనులలో ప్రపంచక్లేశమున్నది..
* * *
ఈమధ్య కొన్నాళ్ళుగా పోస్టులు కనబడకపోయేసరికి అనుమానమొచ్చింది.. అప్పుడెప్పుడో స్నేహితుల లిస్టుకి సిజరేస్తున్నానన్నారు కదా అని భయమేసి చూశా.. హమ్మయ్యా ఫ్రెండేనని ఊపిరి పీల్చుకున్నా.. భుత్ ఈ నెవెర్ ఆంతిచిపతెద్ ఠిస్...
ఎంతో రాసేసి, ఇంకెంతో చేసేసి ఇంత చిన్న వయసులోనే విశ్వాటనకు వెళ్ళిపోయినవాళ్లను చూస్తోంటే మాత్రం ఒక్కటే అనిపిస్తుంది.. 'కమాన్ రాజా.. ఎక్కువ టైం లేదు.. తొందరపడు..' అని ఓ అదృశ్యవాణి చెబుతున్నట్టుగా..
తేరేషన్నా.. నాకు తెలీని నేనింతవరకూ కలవని ఒక మనిషి కోసం నేనింత బాధపడటం ఇదే మొదటిసారి..  Here are my two tear drops for the Facebook Friendship and the tremendous lines that you treasured before leaving..

*****   *****   *****   *****   *****   *****   *****   *****   *****   *****   *****   *****  

APARNA THOTA

https://www.facebook.com/aparna.thota.1?fref=nf
“రావడం రాకపోవడంలో ఏమి లేదు
పాదముద్రలతోనే బాధంతా
కొన్ని భూమి మీదా
కొన్ని గుండె మీదా”
ఇంచుమించుగా ఇవే పదాలు...భావం మాత్రం ఇదే! పైడి తెరేష్ బాబు ఫేస్బుక్ లో స్నేహితుడైనప్పుడు ఒకానొక రోజు ఈ పోస్టు చూసి రోజంతా ఈ పదాలతోనే గడిపేసాను. ఎప్పుడన్న మనసు కాస్త సంక్షోభంలో ఉంటే ఈ మాటలే గుర్తుకొచ్చి కాస్త సాంత్వన ఉండేది. చాలా గొప్ప మనసున్న మనిషని సాయిపద్మ, కిరణ్ చెర్ల ద్వారా విన్నాను. ‘అపార్ధము’ అన్న పదంతో ఆయన కొన్ని పద్యాలూ, కొన్ని చిలిపి ప్రశ్నలూ పెట్టేవారూ...ఎంత ఎంజాయ్ చేసేదాన్నో.
కొంత కాలానికి మహేష్ కత్తి పోస్ట్ చేసిన ఆయన కథ ‘సోమాలియా మేక’ చదివాను.ఎంత నచ్చిదంటే...ఆ స్థాయి అందుకోవడం అంత తేలిక కాదు అని గట్టిగా అనుకున్నాను. పైగా రచనా శైలి లో 'కష్టపడి రాసేవారు, నిజంగా టాలెంట్ తో రాసేవారు', ఎవరు ఎవరో తెలిసిపోతుందనుకుంటా...సోమాలియా మేక ఆయన ఖచ్చితంగా ఏకబిగిన రాసి ఉంటారని, అచ్చుతప్పులు తప్ప మరోటి చూసి ఉండరని నమ్మకంగా ‘తెలిసిపోయింది.’ ఆశయం లో దుబాయ్ లో ఒక నెల రోజులున్నాను. ఇండియా వచ్చేవరకూ ఆగలేక, ఆయనకూ అక్కడినుండే ఫోన్ చేసాను. కొన్ని, కబుర్లూ, కాస్త పాటలూ కూడా అయ్యాయి. ఏమాత్రం కొత్తనిపించలేదు నాకు! వచ్చాక తప్పకుండా కలుస్తానని చెప్పాను. కాని కలవలేదు. ఇంకొన్ని నెలలకి ఆయకు బాలేదని తెలిసాక, 'వెళ్దామా?' అని కొందరు మిత్రులని అడిగాను కాని వెళ్లే ఉద్దేశం నిజానికి అసలు లేదు. వెళ్ళాలనిపించలేదు.
ఈఛూ లో ఉండి చూడడానికి వెళ్ళిన వాసిరెడ్డి వేణుగోపాల్నో/ప్రసాదమూర్తి నో, “హే మాన్, నీకిక్కడకి రావడానికి విసా ఎవరిచ్చారు” అని అడిగారట! నిన్న ఆయన చనిపోయారని తెలిసినప్పుడు జరుగుతుందని తెలిసిన విషయమేగా అని ఎంత సర్దుకున్నా కష్టంగా అనిపించింది. ఆఖరుకు సరే వెళ్దాం అని మిత్రులతో బయలుదేరినా...సరిగ్గా ఆయన ఇంటికి నాలుగు మెట్ల ముందు ఆగిపోయా...ఎందుకొ మెత్త వేదాంతం వల్లించాలని లేదు...కాని చాలా ఆలోచనలే వచ్చాయి.
ఇదంతా ఆఖరుకు ఫేస్బుక్ మీద మాత్రమే చేరే ఘోష అని ఎక్కడో సుబ్చొన్స్చిఔస్ మింద్ చెప్తూనే ఉంది. అంతకు మించి ఏమీ చేయకపోవడం నా ప్రారబ్ధం! తెరేష్, మీరు నాకు జ్ఞాపకం కాలేరు...మిమ్మల్ని ఎక్కువగా చదవలేదు, వినలేదు...కాని మీరు ఎప్పటికీ నిలిచివుండే ఒక భావన మాత్రమే!


*****   *****   *****   *****   *****   *****   *****   *****   *****   *****   *****   *****  

MAHESH KATHI

https://www.facebook.com/mahesh.kathi?fref=ts

అన్నను కలిసిన ప్రతిసారీ సినిమాల గురించే చర్చ. తను తియ్యాలనుకున్న కథల గురించి చర్చ, నేను రాసుకుంటున్న కథలపైన, పైడన్న సునిశిత విమర్శ. రిపోర్టర్ సినిమాలోని ఒక సీన్ విషయంలో నా ఆలోచన సాగకపోతే తను అరువిచ్చిన కొన్ని పదకత్తుల సాక్షిగా పైడి తేరేష్ బాబు ఎప్పుడూ నాతో ఉంటాడు.



MOHAN RISHI

https://www.facebook.com/mohan.rishi?fref=ufi


ప్రపంచానికి త్రెటెనేష్ బాబు!
ఎప్పుడూ నవ్వుతూ వుండేవాళ్ళంటే లోకానికి ఏడుపు. ముడ్డి మీద తన్నేవాళ్ళంటె ముక్కు మీద కోపం. బట్టలు విప్పి బజాట్లో నిలబెట్టేవాళ్ళంటే భయం భయం క్షణం క్షణం.
ఆ పనులన్నీ చేసి, లోకానికి కోపకారణమైన తెరేష్ అన్న అంటే నాకందుకే ఇష్టం!
****
అష్టలక్ష్మి కమాన్ నుంచి ఇంటివేపు నడవడం మొదలు పెట్టేవరకూ, నువ్వు లేవన్న నిజం నన్నేమీ మరీ ఎక్కువగా తాకలేదు. గతకొద్దికాలంగా నీ ప్రాణం ఆసిలేషన్స్ ఎప్పటికప్పుడు తెలుస్తుండడం వల్ల కావొచ్చు, అప్పటివరకూ బస్సుల్లో, ఆటోల్లో తిరగడం కారణం కావొచ్చు. నడుస్తున్నాగా, అడుగు అడుగులో నీ జ్ఞాపకాలు అడ్డుపడ్తున్నాయి.
****
నన్ను నేను "కవిసంగమం" సాక్షిగా, లా మకాన్లొ పరిచయం చేసుకున్నది మొదలు, ఒకానొక అనుబంధం అల్లుకున్న వైనం, ఇప్పటికీ జ్ఞాపకం. మెచ్చని సమకాలికుల టైపు కాకుండా, నా "జీరో డిగ్రీ"ని గుండెలకి హత్తుకున్న ప్రేమైక జీవివి. "మనకొక రేంజ్ ఉంది కద, నచ్చిన అన్నింటికీ మనం స్పందించడమేంటీ?" అని ఆలోచించేవాళ్ళని చూసి భలేగా నవ్వుకున్నవాడివి.
****
కోపం, తిట్టడం, కొట్టడం, ఉమ్మేయడం, సంస్కార చిహ్నాలు కావనే గాట్ఠి నమ్మకంతో ప్రబలమైన కార్యాచరణలో దిగే లోకాన్ని మై ఫుట్ అన్నోడివి. పైన చెప్పినవన్నీ లోకం మీద చేసి మరీ నీ నిరసన తెలిపినవాడివి. జనాకాంక్ష అయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను సంపూర్ణంగా అర్థం చేసుకుని, మహోధృతమైన "విభజన గీత"ని విస్పష్టంగా వినిపించినవాడివి. అన్నింటికీ మించి ఆఖరి క్షణం వరకూ జీవితమ్మీద ఆశ కోల్పోనివాడివి. చిటికెలు వేస్తూ "మనం మరోసారి లేస్తాం, చూపిస్తాం రుషీ" ఆంటూ ఆలింగనంతో నిలువెత్తు ఆత్మవిశ్వాసమైన నిన్ను కొద్దిక్కొద్దిగా నాలోకి ఇంజెక్ట్ చేసిన వాడివి.
****
కోల్పోయాం అన్నా, నిజ్జంగా. నిజమైన మనుషుల్లేని కరువు కాటకాల కాలంలో, వింతలమారి ప్రపంచంలో, ఇప్పుడు మేము అచ్చమైన సోమాలియా మేకలం!



                                 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
                                ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
                                         ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments

Popular Posts