అలిఖితాలు 3

అంతరాంతరాల ఆగ్రహానికి అక్షరాల అలిఖితాలు
కొన్ని పదాలు మన ప్రమేయం లేకుండా దూసుకొస్తాయి.
తరువాతే వాటికో అర్థం పరమార్థం వెతుక్కోవడం

అలిఖితాలు 3
-------------------
కొన్ని క్షణాల దగ్గరే ఆగిపోతానెందుకో....
ఇసుకో జొనిపిన దూదుంపుల్లలా
అటూ ఇటూ అంటూ ఎటో పారేసుకున్న మనసులా
ప్రకంపించే అంతస్స్పందనలా....
ఆగిన చోటు నుండే తిరిగి వెతుకులాటవుతుంది
ఏరుకొచ్చిన గుండెచప్పుళ్ళు కలల విత్తుల్ని మూట కడతాయి
పాదు కట్టిన కాలం కొమ్మలు పూచే పూలకోసమా ఎదురుచూపులు...
అన్ కండిషనల్ లవ్ సుమా
ఆత్రపడకు.... అక్కడ ప్రేమించేదుకు తీరికల్లేవ్
సగం దూరంలోనే ఊహాక్షరాలకు ఎండమావులు అంకితమిచ్చి
పదాల వాడి తో లోకంలోకి దూసుకెళ్ళే జ్ఞానులే అంతా
బోధి వృక్షాల్ని విరివిగా పెంచండీ
'బుద్ధ' జీవులకు అంటు కట్టాలి...
పిడికిలంత హృదయం చుట్టూ ఇన్ని కృష్ణ బిలాలెందుకు...
ఆశల తాళపత్రాలు చదువుకుంటూ
తనది కాని హృదయవనం లో విత్తులు పాతుకుంటూ
చీల్చుకొచ్చిన హరితాన్ని చూసి ఆమడదూరం పరిగెత్తే
నిర్నిమిత్త హృదయ చౌర్యాలు వార్తల్లో వినపడవేం....?!?
--- జయశ్రీ నాయుడు

Comments

Popular Posts