స్త్రీ... ప్రపంచపు ఉదయం!
1.
దుఖాన్ని నగ్నం గా చూడనిదే
ఆనందపు అలంకారల్ని మోయలేవు
కలల చీకటిని చీల్చనిదే
నిజానికి వెలుగద్దలేవు
పెదవి పంట బిగపట్టనిదే
వేదనా కెరటపు స్నేహమవ్వలేవు
మనిషిగా మనసు శిలువ మోయనిదే
స్త్రీ పురుష భేదం లోని అభేదం అనుభవించలేవు
2.
నా చుట్టూ ఎన్ని వేదనామయ శిబిరాలు
బ్రేకింగ్ న్యూస్ లుగా వినోదం పంచుతున్న ఆక్రందనలు..
పసిపాపగా పొత్తిళ్ళదాకా రానివ్వని పాపాత్ములు
భగ్గుమనిపించే వరకట్న వికృతులు
అందాన్ని చూసి ఆసిడ్ల బుడ్డీలైన ప్రేమ పరాకాష్ఠలు
కళ్ళతోనే నిరంతరం భళ్ళుమనే వాంచా వికారాలు
ఇవన్నీ చాలవన్నట్లు ఆడతనం మాత్రమే
ఆనందపు మూలమనుకునే మగతనపు నిర్లజ్జా పూరిత మోహ భంగాలు..
3.
ఒక్క క్షణం ఆగవోయ్..
తండ్రిగా ఆడశిశువు కుత్తుక నొక్కే రాక్షసత్వమా..
నీ తల్లినీ పుట్టవొద్దనుకుంటే..ఈ రోజు నువ్వెక్కడా..
పాశవిక ప్రేమికుడా..ఆసిడ్ నీ మొఖమ్మీద పోసుకో
ఒక్క క్షణం ఆ బుసబుసలు అనుభవించు..
తర్వాత నిరూపించు నీ ప్రేమను..
మోహం తో కళ్ళు మూసుకుపోయిన కాముకత్వమా..
విశృంఖల శిశ్నాలతో నిర్లజ్జగా విజృంభించే ముందు
పశువు నుంచి జ్ఞానాన్ని అరువు తెచ్చుకో
అవైనా కొంత చాటూ.. కొంత అంగీకారాన్నీ కోరుకుంటాయి..
4.
జీవితం, ధైర్యం, కరుణా...
అద్దం లో గజిబిజి రూపాలుగా మిగులుతున్నాయి
ప్రాణం ప్రథమ పర్వం నుండీ..
అంగీకారం లేని ఆహ్వానం లా ఆడజన్మ
ఆదతనమే కాదు
అమ్మతనమూ అక్కడే అక్షరం దిద్దుకుంటుంది
ఆత్మ విశ్వాసం ఆకాసం లో సగమవుతుంది
సహనానికీ వొక అసహనం చురకత్తవుతుంది
కష్టాలున్నప్పుడే కన్నీరు రానివ్వని తెగువ పుట్టేది
ద్వేషపు జ్వాలల్లోంచే నీరు లేకుండా మంటలార్పే మగువ పుట్టేది
నవ్వుతూనే ముళ్ళ పదును పెకిలించి తనదంటూ ఒక దారి కూర్చేది
మలుచుకుంటూ జీవితం
పెంచుకుంటూ ధైర్యం
పంచుతూ కరుణ.. ఓ స్త్రీ..
నీకెంత నమ్మకం..
సహిస్తూ ప్రపంచపు కఠినత్వం
మాతృత్వపు మూలాల్లోంచి పెంచుకొస్తావు మానవత్వం
జీవితపు ప్రతి బంధం లోనూ..
నిరూపిస్తావు నువ్వే నీకు సాటి అని ప్రతి ఉదయం
---- జయశ్రీ నాయుడు
లెక్చరర్
Comments
Post a Comment