సంక్రాంతి నాదే...



తెల్లవారుతోంది.. చీకటిగానే వుంది.. 
రాత్రే మెనూ ఫిక్స్ చేసుకున్నాను 
గారెలకోసం పప్పు నానబెట్టాను 
తెల్లవారు ఝామునే మెలకువ వచ్చింది...
యథా ప్రకారంగా గోడ మీద వున్నా ఏడుకొండల స్వామికి గుడ్ మార్నింగ్ చెప్పి పండగ పనులకి చెంగుదోపాను...
వణికిస్తున్న చలిలో ముగ్గులు రంగులు.. 
దుప్పటి ముసుగు తీయని పిల్లలు 
తెల్లారే లేపడం ఎందుకులే అన్న ఫీలింగ్ నాలో 
చక చక పనులు కానిస్తున్నా... 
గారెలు, కొబ్బరిపచ్చడి, పులిహోర, పాయసం... మెనూ బానే వుందని పించింది.. 
వేరే స్పెషల్ కావాలంటే స్వగృహ డిల్లీ మిఠాయి భండార్లు మనకోసమే వున్నాయి..  :)
ఫ్రిజ్ తీసి చుస్తే కూరకి చిక్కుడు కాయలు టమోటాలు కనిపించాయి 
తీసి బైట పెట్టాను గానీ పండగ స్పెషల్స్ తర్వాత పిల్లలు ఈ కూరలేం తింటారు అన్న డౌటు...
ఏమో... ఎంత స్పెషల్స్ తిన్నా కూర కూరే చారు చారే.. వాటి టచ్ వాటిది.. 
ఈ ఆలోచనలతోనే గారెలు, పాయసం చేయడం పూర్తయింది.. 
పులిహోరకి పులుసు చేస్తూ పెద్దవాడిని పిలిచాను 
నా మెనూ లకి ప్రతిసారి జడ్జి వాడే 
కృష్ణా... అని పిలిచి వరసగా వెరైటీలు చెప్తున్నా 
గారెలు, పాయసం పులిహోర...
చాలు అన్నాడు 
ఒక్ఖ నిమిషం ఏమీ అర్థం కాలేదు..
మరోసారి రెట్టించి అవే చెప్పాను..
చాలు ఇంకెందుకు ఎక్కువ చెయ్యడం అన్నాడు...
గుండె లో ప్రేమ కెరటం ఉవ్వెత్తున లేచి గొంతు మూగ పోయింది..
ప్రేమంటే... ఎదుటి వాళ్ళ కష్టాన్ని గుర్తించడం కూడా...
నా ముందు నిలువెత్తు ప్రేమ రూపం నిలిచినట్టనిపించింది..
ఆడవాళ్ళు కోరుకునే వాటిల్లో అతి ముఖ్యమైనది ఇంట్లో వాళ్ళు తమ కష్టాన్ని గుర్తించడం...
ఆ ఒక్కటీ చాలు!
సంక్రాంతి నాదే... చిన్న నవ్వుతోటి తిరిగి నా కిచెన్ లోకి వెళ్ళిపోయాను...



   

Comments

Popular Posts